రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టి.. అక్రమ వలసదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలామణి అవుతోన్న అమెరికాకు వెళ్లి స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. అలా, ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు.. అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారు అక్రమ మార్గాల్లో ఒకటైన ‘డేరియన్ గ్యాప్’ను దాటడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. రెండు రోజుల కిందట భారత్‌కు తిరిగొచ్చిన 104 మంది వలసదారుల్లో ఎక్కువ శాతం ఈ మార్గంలోనే అమెరికాలోకి ప్రవేశించారు.
ప్రస్తుతం ఈ మార్గం ఎక్కడుంది? అంత భయంకరమైందా? అనే చర్చ జరుగుతోంది. కొలంబియా-పనామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే డేరియన్ గ్యాప్. మొత్తం 97 కిలోమీటర్లు ఉండే ఈ కీకారణ్యంలో ఎత్తైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత పాములు, క్రూరమృగాలు, నిరంతం ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో ఉంటుంది. ఈ ప్రాంతంలో రహదారి అనే ఊసే ఉండదు. అక్కడ ఎలాంటి నిఘా ఉండదు కాబట్టే స్మగ్లర్లు తమ స్థావరాలుగా చేసుకుని.. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాతోపాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా చేసుకున్నారు.
అమెరికాలోకి అక్రమంగా తరలించడానికి డేరియన్ గ్యాప్‌ను ముఠాలు ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. ఈ మార్గాన్ని దాటేందుకు ఏడు నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా సులభంగా లభించే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు అక్రమ వలసదారులను తరలిస్తారు. అక్కడ నుంచి మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి పంపే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అనారోగ్యం, దాడులు కారణంగా అనేకమంది మృత్యుముఖంలోకి చేరుకుంటారు. ఇక, మహిళల పరిస్థితి దారుణంగా ఉంటుంది. డ్రగ్స్ ముఠాల వారిపై అఘాయిత్యాలకు హద్దే ఉండదు. ఎవరైనా ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే.
కొన్ని దశాబ్దాల కిందట అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేలల్లో డేరియన్ గ్యాప్‌ను ఎంచుకునేవారు. కానీ, ప్రస్తుతం ఏటా లక్షల మంది ఈ మార్గం గుండా దాటుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023లోనే దాదాపు 5.2 లక్షల మంది దాటి అమెరికాలోకి ప్రవేశించారు. గతేడాది మాత్రం నిఘా పెంచడంతో 3 లక్షలకు తగ్గినట్లు సమాచారం. భారత్‌తో పాటు పాక్, బంగ్లాదేశ్, వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్ నుంచి వెళ్లే అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |