అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా బీజేపీ తమ అభ్యర్థులను కొనేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ ఆప్ అధినేత అర్విందే కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అలా ఏసీబీ బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లగా.. ఆప్ నేతలు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కేజ్రీవాల్ "ఆపరేషన్ లోటస్" ఆరోపణలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీ అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయగా.. లేదు గెలిచేది మేమే అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ మఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే బీజేపీ తన పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికీ 15 కోట్ల రూపాయల వరకు డబ్బును ఎరగా వేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ బృందం..!
ఈక్రమంలోనే బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి లేఖ రాస్తూ ఫిర్యాదు చేశారు. ఆప్ నాయకులు ఆరోపణలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఎల్జీ సక్సేనా కేజ్రీవాల్‌ను విచారించాలంటూ అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే ఏసీబీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అంతకు ముందే ఆప్ అభ్యర్థులు అంతా అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే దీనిపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. 16 మందికి పైగా అభ్యర్థులకు బీజేపీ ఆఫర్ ఇచ్చిందని.. వారందిరకీ ఒకే నెంబర్ నుంచి ఫోన్ రాగా ఆ నెంబర్‌ను ఏసీబీ అధికారులకు చెప్పామని అన్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై స్పందించని ఏసీబీ.. బీజేపీ ఫిర్యాదుతో వెంటనే తమపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తాము కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి మరీ ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఇదంతా ఇలా ఉండగా.. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. 8వ తేదీ అంటే రేపే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. రేపే దేశ రాజధానిని ఏలబోయేది ఎవరో తేలనుంది.
![]() |
![]() |