కాలం, టెక్నాలజీ మారుతున్న కొద్దీ దొంగలు తమ విధానాలను కూడా మార్చుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ కావడంతో సైబర్ క్రైమ్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో వివిధ రకాలుగా యూజర్లకు ఆశచూపి దర్జాగా ఏసీ గదుల్లో కూర్చొని లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌లకు బాగా డిమాండ్ ఉండటంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న ట్రిక్స్‌తో నెటిజన్లను బురిడీ కొట్టిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ మహిళకు తక్కువ ధరకే కోడిగుడ్లు ఇస్తామని ఏకంగా రూ.48 వేలు కొట్టేశారు. దీంతో తాను నష్టపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని వసంత నగర్‌కు చెందిన ఓ 38 ఏళ్ల మహిళ.. డిస్కౌంట్ కోడిగుడ్ల కోసం ఆశపడితే భారీగా మోసపోయింది. ఈ నెల 17 వ తేదీన సదరు బాధిత మహిళ ఒక ఈ-మెయిల్ చూసింది. అందులో కోడి గుడ్ల ధరలపై భారీగా డిస్కౌంట్‌లు ఇస్తున్నారని ఉంది. ఆ ఈ-మెయిల్‌లో ఒక షాపింగ్ లింక్ ఉండగా.. ఆ మహిళ దాన్ని ఓపెన్ చేసింది. ఆ తర్వాత ఎన్ని కోడిగుడ్లు కొనుగోలు చేయాలి.. డెలివరీ ఎక్కడ ఇవ్వాలి అనే వివరాలు అడిగినట్లు తెలిసింది. అందులో రకరకాల ఆఫర్లు కనిపించాయి. అయితే 8 డజన్ల కోడి గుడ్లను కేవలం రూ.99 కే అందిస్తున్నట్లు అక్కడ కనిపించింది. దీంతోపాటు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని కూడా ఉంది.
దీంతో ఆ ఆఫర్ కోసం మహిళ 4 డజన్ల కోడిగుడ్లను రూ.49 కి ఆర్డర్ చేసింది. అయితే అందులో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడగ్గానే ఎంటర్ చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత పేమెంట్ పేజీ ఓపెన్ అయిందని.. అందులో కేవలం క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే అనుమతించగా.. తాను తన క్రెడిట్ కార్డు నంబర్, ఇతర వివరాలు అందించినట్లు పేర్కొంది. అయితే ఓటీపీ ఎంటర్ చేయకుండానే తన క్రెడిట్ కార్డు నుంచి రూ.48199 కట్ అయినట్లు బాధితురాలు తెలిపింది. ఆ డబ్బులు "షైన్ మొబైల్ హెచ్‌యూ" అనే పేరు గల అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్ వచ్చిందని వెల్లడించింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసులను ఆశ్రయించింది.
ఈ పేమెంట్ తర్వాత తన క్రెడిట్ కార్డు ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ వచ్చిందని.. దీంతో జరిగిన సైబర్ నేరం గురించి తాను వివరించినట్లు తెలిపింది. వెంటనే బ్యాంక్ అధికారులు తన క్రెడిట్ కార్డును క్యాన్సిల్ చేశారని.. ఆ తర్వాత సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. తన క్రెడిట్ కార్డు లిమిట్ రూ.3.7 లక్షలు కాగా.. ఆ కార్డును బ్లాక్ చేయకపోతే మరిన్ని డబ్బులు కట్ అయ్యేవని పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. నిందితుల ఖాతాల్లో డబ్బులు ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు.