అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. అంబానీ ఇంట పెళ్లి అంటే ఒక రేంజ్‌లో ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ప్రత్యేకతలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తమ అతిథులకు పసందైన విందు ఏర్పాటు చేయనుందటా అంబానీ కుటుంబం.
మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 రకాల వంటకాలను వడ్డించనున్నారటా. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా విందు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ మెనూ చూస్తేనే అతిథులు ఆహా అనేలా వంటకాలు ఉండనున్నాయి. మూడు రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 65 మంది చెఫ్ లను పిలిపిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అతిథులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ వంటి పలు దేశాల సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 రకాల వంటకాలు ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు.. బ్రేక్ ఫాస్ట్‌లో 75 రకాలు, మధ్యాహ్నం లంచ్ లో 225 వంటలు, రాత్రి డిన్నర్‌లో 275 రకాల వంటకాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాదు మిడ్ నైట్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారట. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు 85 రకాల వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. పోహా, జిలేబీ, భుట్టే కా కీస్, కచోరీ, ఖోప్రా ప్యాటిస్ వంటి ఇండోర్ వంటకాలు ఈ విందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి.
ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దాదాపు 1000 మందికి పైగా ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు సమాచారం.