రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు మంగళవారం నాడు తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పోలింగ్ బూత్ల ఆక్రమణకు గురయ్యే మండలాలు, గ్రామాలను లేఖలో ప్రస్తావించారు. త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో లేఖ రాశారు. 2009, 2014, 2019లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ డేటాను విశ్లేషించాలని అచ్చెన్న తెలిపారు. 2021లో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గూండాలు ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదని చెప్పారు. మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, రెంటచింతల మండలాల్లో నమోదైన నామినేషన్ల వివరాలు ఎస్ఈసీకి అచ్చెన్న పంపించారు. మాచర్లలో అధికారపార్టీ గూండాలు హత్యలు, దొమ్మి, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట రామిరెడ్డిలు ఆడమన్నట్లు అధికారులు, పోలీసులు ఆడుతున్నారని చెప్పారు. మాచర్లలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.