ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు అతివేగం కారణంగా అసువులు బాసి కన్నవారికి కన్నీరు మిగులుస్తున్నారు. ఆగిరిపల్లిలోని ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో విజయవాడ నుంచి నూజివీడు వెళుతున్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో సీఎస్‌ఈ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆగిరిపల్లి మండలం నెక్కలం గ్రామ వాసి మచ్చా వెంకట్రావు కుమారుడు యశ్వంత్(19) తన బైక్‌తో ఢీకొన్నాడు. తీవ్ర గాయాలపాలైన అతనిని స్థానికులు స్పందించి 108కి సమాచారమిచ్చి విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించారు. కళాశాల ఎదురుగా రోడ్డుకు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.