రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధపడుతుందా ? ఏదైనా కీలక ప్రకటన చేయబోతారా ? అని ఎదురుచూసిన కేడర్‌కు బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాశనే మిగిల్చారు. గోదావరి క్లస్టర్ పరిధిలో బూత్ కమిటీ సభ్యులకు మంగళవారం ఏలూరులో రక్షణ మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేకించి అధికార వైసీపీని దుయ్యబడుతూనే, కేంద్రంలో అత్యధిక స్థానాలతో ఎన్‌డీఏ ప్రభుత్వం రాబోతోందని కార్యకర్తల్లో జోష్ పెంచారు. గంటన్నరకు పైగా సాగిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక వైపు, బీజేపీయేతర పక్షాల అపజయాలను ఏకరవు పెడుతూనే ఇంకోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను సవివరంగా వివరించారు. ‘‘రామ మందిర నిర్మాణం ఎప్పటిలోపు పూర్తి చేస్తారు ? సంవత్సరాలు, తేదీలు వున్నాయా ? లేదా ? అని కొందరు అనుమానం లేవనెత్తారు. కానీ అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్ఠించాం. అనుకున్నది అనుకున్నట్లు క్రతువును పూర్తి చేశాం’’ అని రాజ్‌నాథ్ ప్రకటించినపుడు సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మిన్నంటింది. వేదికపై వున్నబీజేపీ నేతలు జైశ్రీరామ్ అంటూ నినదించారు. కార్యకర్తల్లో కనిపించిన జోష్‌ను చూసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చేస్తుందన్నారు. రాబోయేది ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఇక్కడి నుంచి ఎంపీలు ఈసారి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తారని సంకేతాలిచ్చారు. ప్రతి కార్యకర్తకు ఒక లక్ష్యం వుండాలి. దీనికి సరిపడా శ్రమించాలి. బీజేపీ ప్రజల నుంచే నాయకులను తయారు చేస్తుంది. కాని, కొన్ని పార్టీలు మాత్రం కుటుంబాలను గురించి ఆలోచిస్తాయి. ప్రధాని మోడీ వల్ల నవభారత్ ఏర్పడింది’’ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.