తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో బుధవారం ఏజెన్సీలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించడంతో పాటు పాడేరు మండలం ఆడారి మెట్ట ప్రాంతంలో టీడీపీ క్యాడర్‌తో ఆమె సమావేశం కానున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అరకులోయలో నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొర, పాడేరు, జి.మాడుగులలో నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. పార్వతీపురం మన్యం నుంచి మంగళవారం రాత్రి 7.30 గంటలకు నారా భువనేశ్వరి అరకులోయ చేరుకుని అక్కడ బస చేశారు. బుధవారం ఉదయం అరకులోయ మండలం మాదల పంచాయతీ ముసిరిగుడ గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త సొనాయి బసు కుటుంబాన్ని ఆమె పరామర్శించి, ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. అనంతరం పాడేరు బయలుదేరి మార్గమధ్యంలో హుకుంపేట మండలం బర్మన్‌గూడ వద్ద ఆమె మఽధ్యాహ్న భోజనం చేస్తారు. తరువాత పాడేరు మండలం ఆడారిమెట్ట చేరుకుని అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఆమె సమావేశమవుతారు. అనంతరం జి.మాడుగుల వెళ్లి అక్కడ మృతి చెందిన టీడీపీ కార్యకర్తలు కోరాబు లక్ష్మణరావు, అనసూరి రాజారావు కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అక్కడి నుంచి పాడేరుకు తిరుగు ప్రయాణమై స్థానిక పాతబస్టాండ్ వద్ద ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం పాడేరు మండలం కిండంగి గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఓండ్రు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇక్కడి నుంచి నేరుగా నర్సీపట్నం చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.