కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తాజాగా మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నసీర్ హుస్సేన్ గెలుపు సందర్భంగా ఆయన మద్దతుదారుల్లో ఒకరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలే కావాలని ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.
బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం కావచ్చని.. కాంగ్రెస్‌కి మాత్రం పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే బీజేపీని విమర్శించే క్రమంలో హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే బీజేపీకి ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలతో కర్ణాటక రాజకీయాలు అట్టుడికి పోతుండగా.. తాజాగా హరిప్రసాద్ చేసి వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ దేశ వ్యతిరేక సెంటిమెంట్లను కలిగిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
"బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం.. కానీ మనకు పాకిస్తాన్ శత్రు దేశం కాదు. అది మన పొరుగు దేశం" అని కర్ణాటక శాసనమండలిలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొన్నారు. బీజేపీ పాకిస్తాన్ శత్రు దేశంగా భావిస్తోందని.. ఇటీవల ఎల్‌కే అద్వానీకి బీజేపీ భారతరత్న అవార్డు ఇచ్చిందని గుర్తు చేసిన హరిప్రసాద్.. ఆయన లాహోర్ వెళ్లి మహ్మద్ ఆలీ జిన్నా సమాధి వద్ద ఆయన లాంటి సెక్యులర్ నాయకుడు లేరని చెప్పారని పేర్కొన్నారు. అప్పుడు పాకిస్తాన్ శత్రుదేశంగా కనిపించలేదా అంటూ హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అయితే హరిప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. 4 సార్లు భారత్‌పై యుద్ధం చేసినా పాకిస్తాన్‌ని కాంగ్రెస్ శత్రుదేశంగా చూడటం లేదని.. హస్తం పార్టీ దేశ వ్యతిరేక భావాలను కలిగి ఉందని విమర్శించింది. పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని హరిప్రసాద్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయని.. జవహర్ లాల్ నెహ్రూ-మహ్మద్ అలీ జిన్నా మధ్య సాన్నిహిత్యం నేటికి కొనసాగుతోందని కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసిందని కర్ణాటక బీజేపీ ట్విటర్ వేదికగా ఆరోపించింది. అసెంబ్లీలోనే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి అండగా నిలవడమే కాకుండా.. భారత్‌పై యుద్ధం చేసిన పాకిస్తాన్‌ని శత్రుదేశంగా పేర్కొనకపోవడం కాంగ్రెస్ మైండ్‌సెట్‌ని తెలియజేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.