ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. ‘రా కదలి రా’ సభల ద్వారా మేనిఫేస్టో లోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2న నెల్లూరు, గురజాలలో.. 4న రాప్తాడులో పర్యటించనున్నారు. 2వ తేదీ ఉదయం నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. కాగా ఇప్పటి వరకు చంద్రబాబు 22 రా కదలి రా సభల్లో పాల్గొన్నారు. కాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారం రోజుల క్రితం పార్టీని వీడారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్‌కు పంపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి, దాంతోపాటే, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తాను వదులుకుంటున్నట్లు వేమిరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీని వదిలి, టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడం నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.