మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం నాడు ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.... శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. APSDRI ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. APSDRI ఎందుకు ఏర్పడింది...దాని అసలు లక్ష్యాలేమిటి.? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా APSDRI పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? అని నిలదీశారు. టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు APSDRI ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని మండిపడ్డారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. APSDRI బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.