సీఎం జగన్ రెడ్డి, ఆయన అనుచరులు టీడీపీ - జనసేన పొత్తు గురించి అనవసరపు విమర్శలు చేస్తున్నారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన నందిగాం మండలం పెద్దబాణాపురం సర్పంచ్ పైల ఇందిరమ్మతో సహా వంద కుంటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. అచ్చెన్న సమక్షంలో టీడీపీలో వైసీపీ నేతలు చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను, తనను బాగా తిట్టే వారికే జగన్ టికెట్లు ఇస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొత్తు గురించి వైసీపీ నేతలకు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయ్యాక వైసీపీ నాయకుల ప్యాంట్లు తడిసి పోతున్నాయని ఆరోపించారు. టికెట్ అడిగిన బాబాయ్‌ని గొడ్డలితో నరికేశారని ఆరోపించారు. జగన్ కోసం కష్టపడిన తన చెల్లి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశారని మండిపడ్డారు. తన సొంత చెల్లి పుట్టుక గురించి ఆయన పార్టీ నాయకులే తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..? ఈ సైకోను ఎప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.