వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రారంభాల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోడ్ కూయకముందే వేలం కేంద్రాలు ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో షెడ్యూల్ ప్రకా రం మార్చి 14న తెరుచుకోవలసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాలు ఈనెల 6వ తేదీనే తెరుచుకోనున్నాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఒంగోలు, కొండేపి వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. వర్జీనియా పొగాకు రైతులకు మరోసారి కలసి రానుందా ? గతేడాది మాదిరిగా మార్కెట్ పుంజుకోనుందా.. గిట్టుబాటు ధరలతో మార్కెట్ హోరెత్తనుందా? అంటే ఒంగోలు, కొనుగోలు ప్రారంభ ధరలు చూస్తుంటే అవుననే రైతులు చెబుతున్నారు. 75 ఏళ్ల పొగాకు చరిత్రలో గత సీజన్‌లో రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ఏకంగా గరిష్ట ధర రూ.288 నమోదై ఆల్‌టైం రికార్డును సృష్టించింది. మార్కెట్ బాగుండడంతో రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. తాజాగా గురువారం రాష్ట్రంలో కొండేపి, ఒంగోలు–1 పొగాకు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలవ్వగా అక్కడ ప్రారంభ ధర చూసి ఇక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు రెండు వేలం కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 18 బేళ్లను కొనుగోలుకు పెట్టగా గరిష్ఠంగా కేజీ పొగాకు ధర రూ.230 నమోదైంది. గతేడాది ఈ ప్రాంతంలో ప్రారంభ ధర కేజీ రూ.160లతో ప్రారంభం కాగా అది క్తాసా కొనుగోలు ముగించే సమయానికి ఏకంగా రూ.288కు చేరింది. ఇప్పుడు ప్రారంభ ధర రూ.230 ఉండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది కేజీ పొగాకు గరిష్టంగా రూ.210 ఉండగా కొనుగోలు ముగించే సమయానికి కేజీ పొగాకు రూ.288లతో ఆల్‌టైం రికార్డు నమోదు చేసుకుంది. ఒకప్పుడు ఏమీ లేనివారికి కనకవర్షం కురిపించిన పొగాకు మధ్యలో కొన్ని సీజన్‌లు అప్పులు పాలు చేసింది. ఆ సమయంలో చాలామంది రైతులు అధికంగా కౌలు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని పొగాకు సాగుకు స్వస్తి పలికారు. గత రెండు సీజన్‌లలో మార్కెట్ ధరలు బాగుండడంతో కొంత ఉపశమనం పొందారు. ఈ ఏడాది ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పొగాకు చేళ్లన్నీ ఇసుక తిప్పలుగా మారాయి. దాదాపు వందల వేల ఎకరాల్లో పొగాకు మొక్కలను తొలగించి మళ్లీ సాగు ప్రారంభించారు. మొదట పెట్టిన పెట్టుబడులు తుఫాన్ మింగేసిం ది. తుఫాన్ తరువాత ఒక్కసారిగా పొగాకు నారు పది రెట్లు అవ్వడంతో చేసేంది లేక రైతులు దైర్యంగా సాగుకు దిగారు. పెట్టుబడులు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ధరలు బాగుంటేనే రైతులు గట్టెక్కేది లేకుండా గతేడాది మిగులు కూడా చేజారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒంగోలు, కొండేపి వేలం కేంద్రాల్లోని ప్రారంభ ధర కాస్త ఉపశమనం ఇస్తున్నాయి.