తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. చంద్రగిరిలో తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. చంద్రగిరి ఆర్ఎఫ్ రోడ్డుకు చెందిన యువతి చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. ఆమె అమ్మమ్మ మంగమ్మ చిన్నప్పటి నుంచి ఆ యువతి సంరక్షణ బాధ్యతలు చూసింది. నర్సింగ్ పూర్తిచేసుకున్న యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది.
ఈ క్రమంలో తన పక్కింట్లో అద్దెకుంటున్న కృష్ణయ్య కుమారుడు పిడతల మహేష్ యువతికి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తర్వాత మహేష్ చెడువ్యసనాలు తెలుసుకున్న యువతి అతడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి మహేష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు.. తరచూ వేధింపులకు పాల్పడేవాడు. 45 రోజుల క్రితం యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ప్రేమోన్మాది మహేష్, యువతితో పాటు ఆమె అమ్మమ్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు.. స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు.
యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రక్షణ లేకపోవడంతో పది రోజుల క్రితం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చైన్నెకి తీసుకెళ్లింది. ఆ యువతి చంద్రగిరి ఆర్ఎఫ్ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు గురువారం రాత్రి తన పెద్దమ్మతో కలిసి చెన్నె నుంచి చంద్రగిరికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మహేష్ అర్ధరాత్రి సమయంలో కత్తి తీసుకుని యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత యువతిపై కత్తితో దాడిచేశాడు.
యువతి ఛాతి, ఎడమ చేతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కత్తిని అక్కడ పడేసి మహేష్ పారిపోయాడు. అనంతరం స్థానికులు అక్కడకు చేరుకు ని, యువతిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుయా ఆస్పత్రికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.