తిరుమలకు చిన్న పిల్లతో వెళ్లేవారికి టీటీడీ ఓ సూచన చేసింది. తిరుమలలో మార్చి 3వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం మార్చి 3న ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1 మరియు 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1 మరియు 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారు.
టీటీడీ శనివారం ఉదయం 10.30 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి.. పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని టీటీడీ సూచించింది.
హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా కళాబృందాల కోలాటాలు, భజనల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు. ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై నాదస్వర, డోలు కచేరి అలరించింది. ఇందులో శ్రీ కేసన్న, శ్రీ వెంకన్న నాదస్వరంపై, శ్రీ నాగరాజు, శ్రీ చంద్రశేఖర్ డోలుపై అద్భుతంగా లయ విన్యాసం చేశారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకురాలు డా. వందన, వారి శిష్య బృందం గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa