రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజుల ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ టికెట్‌ను భద్రంగా దాస్తాం. ఆ టికెట్ చిరిగిపోవడమో లేక ఎక్కడో పెట్టి మర్చిపోవడమో జరిగితే ప్రయాణం చేయలేం. రిజర్వేషన్ చేసుకున్నా మీ వద్ద టికెట్ లేకపోతే టీటీఈ మీకు భారీగా ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇలా టికెట్ పోగొట్టుకోవడమో లేదా చిరిగిపోవడమో జరిగినప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. టికెట్ పోయినా, చిరిగిపోయినా దానికి ప్రత్యామ్నాయ సదుపాయాన్ని తీసుకొచ్చింది రైల్వే శాఖ. టికెట్ పోయినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా డూప్లికేట్ టికెట్ పొందే వీలు కల్పిస్తోంది.
మీరు డూప్లికేట్ టికెట్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందు కోసం రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్లి మీ టికెట్ పోయినట్లు సమాచారం అందించాలి. మీకు డూప్లికేట్ టికెట్ కావాల్సి వచ్చినప్పుడు ఛార్ట్ ప్రిపేర్ అవ్వక ముందు, ప్రిపేర్ అయిన తర్వాత ఛార్జీలు వేరు వేరుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. మీ టికెట్ కన్ఫర్మ్ అయిన ఛార్ట్ ప్రిపేర్ కాకముందు మీరు సమాచారం ఇస్తే మీకు డూప్లికేట్ టికెట్ జారీ చేస్తారు. ఇందుకు క్లరికేజ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్ఏసీ టికెట్లు గల వారు సైతం ఈ సేవలు పొందవచ్చు.
ఒకవేళ ఛార్ట్ సిద్ధం చేశాక అయితే పోయిన టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ కు దరఖాస్తు చేస్తే మొత్తం ఫేర్ లో 50 శాతం ఫీ చెల్లించాల్సి వస్తుంది. ఆర్ఏసీ టికెట్ వారికి ఈ సదుపాయం ఉండదు. ఒక వేళ టికెట్ చిరిగిన సందర్భంలో 25 శాతం ఫీ చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు.. మీరు డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత మీ ఒరిజినల్ టికెట్ దొరికినట్లయితే.. ప్రయాణం ప్రారంభానికి ముందే రైల్వే అధికారులకు ఆ డూప్లికేట్ టికెట్ ఇస్తే 5 శాతం ఛార్జీలు మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మీకు రిఫండ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే ఐఆర్‌సీటీసీ అకౌంట్లోకి వెళ్లి టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.