ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని జూన్ 15 వ తేదీలోగా ఖాళీ చేయాలని.. ఆ పార్టీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ప్రదేశాన్ని ఢిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించినట్టుగా గుర్తించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని సుప్రీంకోర్టు గుర్తించింది. న్యాయ అవసరాలకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టులు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆ స్థలాన్ని కేటాయించినట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ఈ క్రమంలోనే భాగంగానే ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆప్ కార్యాలయం ఉందని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరని.. కోర్టుకు కేటాయించిన భూమిలో ఒక రాజకీయ పార్టీ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుందని సీజేఐ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలన్నింటిని తొలగిస్తామని.. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి అప్పగించాలని సీజేఐ నేతత్వంలోని జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
ఇక ఆఫీసులకు స్థలం కేటాయింపు కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాన్ని సంప్రదించాలని ఆప్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఆ విభాగం పార్టీ దరఖాస్తును పరిశీలించి.. 4 వారాల్లోగా నిర్ణయాన్ని తెలపాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కార్యాలయాలు ఖాళీ చేసే సమయాన్ని జూన్ 15 వ తేదీ వరకు ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. దేశంలోని 6 జాతీయ పార్టీల్లో ఒకటైనా ఆప్‌ను జాతీయ పార్టీ అని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కేటాయింపులు చేయాలేదని కోర్టుకు విన్నవించారు. మరికొన్ని రోజుల్లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పార్టీ కార్యాలయం ఖాళీ చేయడానికి జూన్ 15 వ తేదీ వరకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ విన్నపానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.