ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని పేర్కొన్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు కూడా లాలూకు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము అంతా ప్రధాని మోదీ వెంట ఉన్నామని సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి మద్దతుగా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలే కాకుండా ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు మోదీ కా పరివార్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ట్విటర్ అకౌంట్‌లో పేరు పక్కన మోదీ కా పరివార్ అనే పదాన్ని ఉంచి.. మోదీకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. దీంతో ట్విటర్‌లో మోదీ కా పరివార్ తెగ ట్రెండ్ అవుతోంది. తాము అందరం ప్రధాని మోదీకి మద్దతుగా.. ఆయన కుటుంబ సభ్యులమేననే తెలియజేయడానికే వారు ఇలా చేస్తున్నారు.
ఇక తనపై లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ సభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు.. వీరంతా తన కుటుంబ సభ్యులేనని తేల్చి చెప్పారు. దేశంలోని ప్రతీ పేద వ్యక్తి తన కుటుంబమేనని.. ఎవరూ లేనివారికి మోదీ ఉన్నారని.. మోదీకి వారంతా ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. "మేరా భారత్ - మేరా పరివార్" అనే భావనతోనే తాను జీవిస్తున్నానని.. లాలూకు మోదీ దీటుగా సమాధానం ఇచ్చారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నానని.. తన జీవితం తెరిచిన పుస్తకమని తెలిపారు. తానెంటో దేశ ప్రజలకు తెలుసని.. ప్రతి క్షణం ప్రజలకు సేవ చేసేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. ప్రజల కలలే తన ఆశయాలని.. వాటిని నెరవేర్చేందుకు నిరంతరం కష్టపడుతానని మోదీ తెలిపారు.
బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ‘జన విశ్వాస యాత్ర’ చేపట్టారు. ఈ యాత్రలో పాల్గొన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీశాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని వారసత్వ, కుటుంబ రాజకీయాలపై నిత్యం విమర్శలు చేస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు బీజేపీ నేతలు ఇలాగే స్పందించారు. చౌకీదార్ చోర్ హై (కాపలాదారు ఓ దొంగ) ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి బదులుగా బీజేపీ నేతలు, కార్యకర్తలంతా ‘మై భీ చౌకీదార్’ (మేం కూడా కాపలాదారులం) అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో చేర్చుకోవడం అప్పుడు సంచలనంగా మారింది.