విద్యా సంబంధమైన కేసుల్లో సంచలన తీర్పులు వెలువరించి పేరు గాంచిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ.. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి.. మంగళవారం రాజీనామా చేశారు. న్యాయ వ్యవస్థ నుంచి తాను రాజకీయ రంగంలోకి దిగనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వివిధ కేసుల్లో తీర్పులు వెలువరించిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ప్రజల న్యాయమూర్తిగా పేరు గాంచారు. ఈ క్రమంలోనే ఆయన కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో.. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఆగస్టు వరకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పదవీ కాలం ఉండగా.. ముందుగానే పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం కేవలం పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయంగా మారింది. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి మంగళవారం రాజీనామా చేయబోతున్నానని తెలిపారు. అయితే తాను రాజకీయాల్లోకి రావడానికి బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కారణమని.. ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గత కొన్నేళ్లలో బెంగాల్ విద్యా విషయాల్లో భారీ అవినీతిని వెలికి తీయడంతో ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత లేబర్ వ్యవహారాల, ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ మొదలైన వాటికి సంబంధించిన కేసుల్లో భారీ కుంభకోణాలు ఉన్నాయని.. వాటిలో తాను కొన్ని విచారణ చేసినట్లు తెలిపారు. కానీ ఆ కేసుల్లో న్యాయం అందించడంలో తాను విఫలమయ్యానని.. అందుకే తన పని ముగిసిందని భావించినట్లు చెప్పడం గమనార్హం.
అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు ఈ తమ్లుక్ లోక్‌సభ స్థానంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత.. బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు, టీఎంసీ నేత దిబ్యేందు అధికారి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు.
న్యాయమూర్తిగా ఆరేండ్లు పనిచేశానని.. ఆ ప్రస్థానం ముగిసిందని.. తాను ఇంకా అందులో కొత్తగా చేయాల్సిందేమీ లేదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. తాను ఇచ్చిన తీర్పులు నచ్చనప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతలు తనను తీవ్రంగా అవమానించారని.. వారికి కొందరు లాయర్లు కూడా మద్దతు తెలిపారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజలతో మమేకం కావాల్సిన అవసరముందని వెల్లడించారు.
ఇక కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామా చేస్తానని ప్రకటించడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్న వేళ.. హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం కోసం పని చేయడం లేదని.. పార్టీల కోసమే పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.