మహిళకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజాగా మహిళల కోసం మరో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉంటున్న మహిళలు ఇక నుంచి నెల నెలా ప్రభుత్వం నుంచి రూ.1000 అందుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి అతిషి మర్లెనా ప్రకటించారు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఈ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనతోపాటు పలు కీలక ప్రకటనలు చేసింది.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలో నివసిస్తున్న 18 ఏళ్లు నిండి అర్హులైన ప్రతీ మహిళ నెలకు రూ.1000 పొందుతారని మంత్రి అతిషి స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ భారీగా నినాదాలు చేశారు. ఇప్పటికే మహిళల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎంతో చేసిందని అతిషి పేర్కొన్నారు. రామరాజ్యంలో తర్వాతి అడుగు మహిళల భద్రత అని తెలిపారు. మహిళల అవసరాలను తీర్చడంలో కేజ్రీవాల్ సర్కార్ ముందున్నందుకు తాము చాలా గర్వపడుతున్నామని వెల్లడించారు.
ఈ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కోసం ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. 2024-25 కు గానూ బడ్జెట్ ప్రవేశపెట్టిన అతిషి.. మొత్తం రూ.76 వేల కోట్ల వార్షిక పద్దును అసెంబ్లీ ముందు ఉంచారు. తమ ప్రభుత్వం రామరాజ్యం ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందిందన్నారు. ఉచిత విద్యుత్, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆప్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. 2014 తో పోలిస్తే 2024 లో మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ఎంతో ప్రయత్నించామని అతిషి స్పష్టం చేశారు.
ఇక తాజా బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి అతిషి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని.. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్‌లో ఉత్తీర్ణత సాధించగా.. 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో పాస్ అయ్యారని అతిషి పేర్కొన్నారు.