సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమీ సామాన్యులు కాదని, మంత్రి హోదాలో ఉన్న మీ మాటల పర్యవసానాల గురించి తెలుసుకోవాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు తర్వాత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై మంత్రి నిర్ణయాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
‘మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద దఖలుపడిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు.. ఆర్టికల్ 25 ప్రకారం మీ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 (సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి) కింద మీ హక్కును వినియోగించుకుంటున్నారా? మీ వ్యాఖ్యల పర్యవసానాలు ఏంటో తెలుసా?.. మీరు సామాన్యుడు కాదు.. మంత్రి.. పరిణామాలు ఏంటో తెలుసుకోవాలి’ అని ఉదయనిధికి తలంటింది. అనంతరం విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.
గతేడాది సెప్టెంబరు 23న సనాతన ధర్మాన్ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, దానిని వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సనాతనవాదులు ముఖ్యంగా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై సోషల్ మీడియాలో యుద్ధం జరిగింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చే వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని బీజేపీ ఆరోపించింది.
సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలకు ఉదయనిధి స్పందిస్తూ.. తాను నిర్మూలించాలని చెప్పలేదని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎటువంటి కేసులను ఎదుర్కోడానికైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. తాను సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, తాను మారణహోమానికి ఆజ్యం పోశానని చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని, మరికొందరు ద్రవిడాన్ని రద్దు చేయాలని అంటున్నారు. అంటే డీఎంకే వాళ్లను చంపాలా?’ అని ఉదయనిధి ప్రశ్నించారు.