మన నిత్యజీవితంలో నీరు చాలా విలువైన వస్తువు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు నీరు లేనిదే మనం ముందుకు కదలలేము. ఇక వేసవి వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది. దీంతో నగరాల్లో జనం వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. దేశంలో సిలికాన్ వ్యాలీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతోంది. ఎండా కాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే బెంగళూరు నగరవాసులు.. నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నీటిని వృథా చేస్తే భారీగా జరిమానా విధించాలని నిర్ణయించింది. నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించేందుకు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు నగరంలోని యలహంక, కనకపుర, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో నివసించే వారికి నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ.. వినూత్న ఆలోచన చేసింది. ఆ హౌసింగ్ సొసైటీలో ఉన్న వారు ఎవరైనా నీటిని అతిగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు ఫైన్ విధించనున్నట్లు తెలిపింది. ఇక ఈ నీటి వృథాను పర్యవేక్షించడానికి స్పెషల్‌గా సెక్యూరిటీని నియమించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ.. ఆ సొసైటీలో నివసించే వారికి నోటీసులు జారీ చేసింది.
బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్ బోర్డు నుంచి గత 4 రోజులుగా నీరు రావడం లేదని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ తెలిపింది. ప్రస్తుతం బోర్ల ద్వారా అక్కడి వారికి నీరు అందిస్తున్నామని.. హౌసింగ్ సొసైటీలో నివసించేవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించినట్లు వెల్లడించింది. నీటిని పరిమితంగా వాడుకుంటేనే వేసవి కాలంలో ఎక్కువ రోజుల పాటు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒకవేళ సొసైటీలో ఉన్నవారు ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించిని నీటిని వృథా చేస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది ఈ నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తారని పేర్కొంది.
మరోవైపు.. బెంగళూరు నగరంలో తలెత్తిన నీటి కొరతను కొందరు ట్యాంకర్ ఓనర్లు ఆసరాగా చేసుకుని జేబులు దండుకుంటున్నారు. ఒక్కో ట్యాంకర్‌ను రెట్టింపు, 3 రెట్ల ధరలకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ నీటి అవసరం ఉండటంతో బెంగళూరు వాసులు ట్యాంకర్ల కోసం ఎగబడుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన సిద్ధరామయ్య సర్కార్.. బెంగళూరు నగరంలో ఉన్న ట్యాంకర్ల యజమానులు మార్చి 7 వ తేదీ నాటికి తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక బెంగళూరు నగరంలో నీటి కొరతను అడ్డుకుని ప్రజలకు నీటిని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. దాని కోసం బెంగళూరులో నీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరు చేసినట్లు డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరు నగరంలోని ప్రజల నీటి అవసరాల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఇక ప్రజల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో ఖాళీ పాల ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి.. ప్రజలకు సరఫరా చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.