రాజమండ్రిలో దొంగలు చెలరేగిపోయారు. ఏకంగా ఫైనాన్స్ కార్యాలయంలోనే చోరీ చేశారు. గురువారం అర్ధరాత్రి ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడిన దొంగలు.. అందినకాడికి దోచుకెళ్లారు. ఇద్దరు దుండగులు ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి.. మొత్తం దోచుకెళ్లారు. లాకర్లు పగలగొట్టిన దుండగులు.. అందులోని డబ్బులను బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలు కార్యాలయంలోకి చొరబడిన దృశ్యాలు ఫైనాన్స్ ఆఫీసు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శుక్రవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది అక్కడి సీన్ చూసి షాక్ తిన్నారు.
శుక్రవారం ఉదయం ఫైనాన్స్ ఆఫీసుకు వచ్చిన సిబ్బంది.. లాకర్లు అన్నీ తెరిచి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే చోరీ జరిగిన సంగతిని పోలీసులకు చేరవేశారు. ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించారు. అనంతరం దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఎలా ఫైనాన్స్ ఆఫీసులోకి చొరబడ్డారనే విషయాలతో పాటు లాకర్లలో ఎంత మొత్తం చోరీకి గురైందనే దానిపై వివరాలు సేకరించారు. మరోవైపు ఈ చోరీ పని అంతర్రాష్ట్ర ముఠా చేసిందా లేదా స్థానికంగా ఉన్న దొంగల పనా అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు పడ్డారు.
అయితే ఏకంగా ఫైనాన్స్ కార్యాలయానికే కన్నం వేసిన నేపథ్యంలో చోరీ కోసం ముందుగానే రెక్కీ చేసుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్‌తోనే దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంత మొత్తంలో సొమ్ము చోరీకి గురైందనే వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ద్వారా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. చోరీ నేపథ్యంలో స్థానికంగా ఉన్న వ్యాపారాలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల గస్తీని మరింత పెంచాలని కోరుతున్నారు. రాత్రివేళల్లో పోలీసు గస్తీని పెంచి.. దొంగతనాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.