అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు టీటీడీ కానుక అందించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలో ఉన్న హరిణి హాస్టల్ బ్లాక్‌లో మరో బిల్డింగ్ అందుబాటులోకి తెచ్చింది. నూతనంగా నిర్మించిన భవనాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ముందుగా అర్చకులు నూతన భవనం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతన భవనం ప్రాంగణంలో ఛైర్మన్, జేఈవో శ్రీ వీరబ్రహ్మం కలిసి మొక్కలు నాటారు. హాస్టల్ భవనంలోని గదుల్లో విద్యార్థినులకు కల్పించిన వసతులను పరిశీలించారు.
మరోవైపు రూ.14 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నూతన భవనం నిర్మించినట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ తెలిపారు. దీనిలోని 112 గదుల్లో 672 మంది విద్యార్థినులకు అదనంగా బస కల్పించే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఈ భవనంలో ఐదు స్టడీ రూమ్‌లు, రిక్రియేషన్ హాలు, 105 స్నానపు గదులు, 105 మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, నూతన భవనం నిర్మాణంతో మొత్తం 1850 మందికి హాస్టల్ వసతి సమకూరిందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అలాగే విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు జ్ఞానం కోసం ఇతరత్రా పుస్తకాలు కూడా చదవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. ఒక మంచి వంద మంది స్నేహితులతో సమానమనే విషయాన్ని గుర్తు చేశారు. పుస్తకాలు చదవడం ద్వారానే తనకు విషయ పరిజ్ఞానం పెరిగిందన్నారు. విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సీపీఆర్వో రవి, శ్రీ ప్రసాద్, డీఈవో భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.