రాజస్థాన్‌లోని కోటాలో విషాదం నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం జరిగిన విగ్రహాల ఊరేగింపులో కరెంట్ షాక్ జరిగింది. ఈ ఘటనలో 15 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చిన్నారుల పరిస్థితి విషమించగా.. మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోట ఎస్పీ అమ్రిత దుహన్ వెల్లడించారు. ఇది చాలా విచారకరమైన ఘటన అని తెలిపారు. స్థానికంగా ఉన్న కాళీ బస్తీకి చెందిన కొందరు కలశాలతో ఊరేగింపు వద్దకు చేరుకున్నారని వెల్లడించారు. అదే సమయంలో ఒక చిన్నారి చేతుల్లో ఉన్న 20 అడుగుల పైపు హైటెన్షన్ వైర్‌కు తాకడంతో కరెంట్ షాక్ జరిగినట్లు పేర్కొన్నారు.
ఇక ఆ ఒక్క చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన మిగితా పిల్లలకు కూడా కరెంట్ షాక్ తగిలిందని వెల్లడించారు. అందులో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒక చిన్నారి 100 శాతం కాలిన గాయాలతో పరిస్థితి మరింత ఆందోళకరంగా ఉందని వివరించారు. ప్రత్యేక వైద్యుల బృందం గాయపడిన చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే అసలు ఈ ఘటనకు కారణం ఏంటి.. అధికారుల నిర్లక్ష్యమేనా అనే అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఎస్పీ అమ్రిత దుహాన్ వెల్లడించారు. విద్యుత్ షాక్ తగిలిన వారిలో ఒక 25 ఏళ్ల యువకుడు ఉండగా.. మిగిలిన వారి వయసు అంతా 14 ఏళ్ల లోపేనని ఎస్పీ వివరించారు. విషయం తెలుసుకున్న కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన చిన్నారులను పరిశీలించిన ఆయన.. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్ కూడా ఆస్పత్రికి చేరుకుని.. చిన్నారులను పరామర్శించారు.