ప్రధాని నరేంద్ర మోదీ.. ఇతరుల పట్ల వ్యవహరించే తీరు మన అందరికీ తెలిసిందే. సామాన్యులతో కూడా కలిసిపోయే వ్యక్తిత్వమే మోదీకి ప్రజల్లో మరింత ఆదరణ వచ్చేలా చేసింది. దేశానికి ప్రధానమంత్రి పదవిలో ఉన్నా.. అతి సామాన్యుడికి కూడా మోదీ ఇచ్చే గౌరవం.. ఆయనను వ్యక్తిగతంగా మరో ఉన్నత స్థానంలో నిలబెట్టింది. అయితే తాజాగా జరిగిన ఓ సన్నివేశం.. ఆయన గొప్ప మనసును మరో మెట్టు ఎక్కించింది. ఓ యువతి ప్రధాని కాళ్లను తాకి నమస్కరించబోగా.. మోదీ వద్దని అడ్డుకున్నారు. అనంతరం ఆమె పాదాలకు నమస్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమం ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.
ఢిల్లీ భారత మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవార్డులు పంపిణీ చేస్తుండగా.. ఓ యువతి ఆయన పాదాలను నమస్కరించేందుకు ప్రయత్నం చేసింది. అది గుర్తించిన ప్రధాని మోదీ.. వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేశారు. అనంతరం తిరిగి ప్రధాని మోదీ.. ఆమె పాదాలకు వంగి నమస్కారం చేశారు. ఈ అనూహ్య ఘటనతో ఆ కార్యక్రమానికి హాజరైన వారిని షాక్‌కు గురి చేసింది. విజేతలుగా నిలిచిన క్రియేటర్లకు ప్రధాని మోదీ.. అవార్డులు అందిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. అవార్డు అందుకున్న తర్వాత జాన్వీ సింగ్ అనే యువతి మోదీ పాదాలకు నమస్కరించాలని ప్రయత్నించింది.
పాదాలకు నమస్కరించడం తనకు నచ్చదని.. ఆ యువతికి ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వెంటనే జాన్వీ సింగ్ పాదాలకు తిరిగి మోదీ నమస్కరించారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ విభాగంలో జాన్వీ సింగ్ ఈ నేషనల్ క్రియేటర్ అవార్డును అందుకున్నారు. జాన్వీ సింగ్ మోదీ కాళ్లకు మొక్కడం.. తిరిగి ప్రధాని ఆమె కాళ్లకు నమస్కారించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాజకీయ నాయకులు అంటే అందరితో కాళ్లకు నమస్కరించడం మనం చూస్తుండగా.. వారందరికీ ప్రధాని మోదీ భిన్నం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సెలబ్రిటీ సృష్టికర్త, గ్రీన్ ఛాంపియన్, సామాజిక మార్పు సృష్టికర్త, అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ సృష్టికర్త, సాంస్కృతిక రాయబారి, ఉత్తమ ప్రయాణ సృష్టికర్త, స్వచ్ఛతా అంబాసిడర్, న్యూ ఇండియా ఛాంపియన్, టెక్ క్రియేటర్‌తో సహా మొత్తం 20 విభాగాలలో ఈ నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ఈ 20 కేటగిరీలకు సంబంధించి మొత్తం 1.5 లక్షలకు పైగా నామినేషన్లు రాగా.. ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తల సాయంతో విజేతలను నిర్ణయించి.. విజేతలకు అవార్డులు అందించారు.