ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్‌ వరల్డ్ 2024 గా క్రిస్టినా పిస్కోవా.. టాప్-8 లో భారత్‌కు చెందిన సినిశెట్టి

national |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 11:13 PM

71 వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ నిలిచారు. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరిగిన ఈ మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా ఈ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు జరిగాయి. మొత్తం ప్రపంచంలోని 112 దేశాలకు చెందిన అందాల భామలు ఈ మిస్ వరల్డ్ 2024 పోటీ పడ్డారు. ఇక ఈసారి భారీ అంచనాలతో మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచిన భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత్ నుంచి పోటీలో ఉన్న సిని శెట్టి 8 వ స్థానంలో నిలిచారు.


టాప్‌-4 లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు ఉన్నారు. ఇక చివరి వరకు తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన ఈ మిస్ వరల్డ్ 2024 పోటీల్లో క్రిస్టినా, అజైటౌన్‌ నిలవగా.. అందులో క్రిస్టినాకే అదృష్టం వరించింది. ఇక మన దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినిశెట్టి టాప్‌-8 తో సరిపెట్టుకున్నారు.


కర్ణాటకకు చెందిన సినీ శెట్టి టాప్‌-8 లో నిలిచారు. ఇతర దేశాల భామలకు సినీ శెట్టి గట్టి పోటీ ఇచ్చినా.. అజైటౌన్‌ (లెబనాన్‌) టాప్‌-4 కు ఎంపిక కావడంతో సినీ శెట్టి వెనుదిరక తప్పలేదు. ఇక ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ.. నీతా అంబానీకి మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును ప్రదానం చేశారు.


దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. చివరిసారిగా 1996లో భారత్‌లో ఈ ప్రపంచ సుందరి పోటీలు జరగ్గా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా విజేతగా నిలిచారు. అప్పుడు భారత్ టాప్ 5 లో నిలిచింది. 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మిస్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి సారి నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో స్వీడన్‌కు చెందిన కెర్‌స్టిన్ కికీ హకాన్సన్ విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com