విశ్వవిఖ్యాత మానవతావాది, ఆధ్యాత్కవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం గురుపాదుకా వనంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశవిదేశాల నుంచి విచ్చేసిన 2.5 లక్షల మంది భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలారు. వేదమంత్రోచ్ఛారణలు, సంగీత సత్సంగాలు, జ్ఞాన ప్రసంగాలతో పులకించారు. ఉత్సవాలలో భాగంగా గురుదేవులు ప్రత్యక్షంగా భక్తులతో చేయించిన ధ్యానం అంతటి జనసందోహాన్ని మౌనపారవశ్యంలో ముంచి ఆంతరంగ ఆనందాన్ని ఆవిష్కరింపజేసింది. ఈ ఉత్సవాల్లో దాదాపు పదిలక్షలకు పైగా భక్తులు అంతర్జాలం ద్వారా పాల్గొన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కేంద్రం
ఉత్సవాలలో భాగంగా సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వేదపఠనం, వీనులవిందైన భజనలతో బాటు లోక కళ్యాణాన్ని, సర్వప్రపంచానికి ఆనందాన్ని, సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ జరిగే పవిత్రమైన రుద్రపూజా కార్యక్రమం స్వయంగా గురుదేవుల చేతులమీదుగా జరిగింది. ‘శివుని శరణాగతి పొందడమే శివరాత్రి ఆంతర్యం’ అని ఈ సందర్భంగా గురుదేవ్ చెప్పారు. ‘శివుడంటే శాంతి, శివుడంటే అనంతం, శివుడంటే సౌందర్యం, ఏకత్వం. నీ నిజమైన స్వరూపం శివుడే. అందువల్లనే నీవు శివుని ఆశ్రయించాలి. ఈ సమస్త విశ్వపు ధ్యాన స్వరూపం శివుడే.’ అని తెలిపారు.
మహాశివరాత్రి
ఈ సందర్భంగా ఆదిశకంరాచార్యుల జీవిత చరిత్రపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపొందించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘ఆదిశంకరాచార్య’పోస్టర్ ను గురుదేవులు ఆవిష్కరించారు. ‘భారతీయ చరిత్రలో ఆదిశంకరులకు ప్రత్యేక స్థానం ఉంది... కానీ వారి జీవిత చరిత్ర చాలామందికి తెలియదు’ అని శ్రీశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టీ నకుల్ ధావన్ అన్నారు.
‘జీవించిన అతి కొద్ది కాలంలోనే దేశం నలువైపులా కాలినడకన పర్యటించి భారతీయ సాంస్కృతిక సమైక్యతను పాటుపడిన తీరు అనిర్వచనీయం.. ఆనాడు వారు స్థాపించిన ఆచార సంప్రదాయాలు నేటికీ మన సంస్కృతికి మూలస్తంభాలుగా ఉన్నాయి’ అని ఆయన అన్నారు. అర్థరాత్రి లింగోద్భవకాలంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులచే గురుదేవులు చేయించిన ధ్యానం ఆనందపారవశ్యంలో ముంచి, శివతత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది.