తన ప్రతిభతో పేదరికాన్ని జయించి, ఆర్మీ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబయిలోని ధారవికి చెందిన 26 ఏళ్ల ఉమేశ్ ఢిల్లీరావు తన తెలివితేటలతో భారత సైన్యంలోకి ప్రవేశించి.. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. తన తల్లి, సోదరితో సహా కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరయ్యారు. అయితే, ఆర్మీలో చేరడానికి ముందు ఉమేష్ పేదరికం, దురదృష్టం వెంటాడాయి. పెయింటర్ అయిన ఉమేశ్ తండ్రి.. 2013లో పక్షవాతంతో మంచానపడ్డాడు. గత మార్చిలో అతడు ఆర్మీ శిక్షణకు రిపోర్ట్ చేయాల్సిన ఒక రోజు ముందు గుండెపోటుతో మరణించాడు. కానీ, దుఃఖాన్ని దిగమింగుకుని ఆర్మీ శిక్షణలో చేరాడు. 11 నెలల శిక్షణ పూర్తికావడంతో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది.
ఉమేశ్ విజయానికి ఆకలే పట్టుదలను ఇచ్చింది. చదువుకుని ఉద్యోగం సాధించాలని నిశ్చయించుకున్న అతడు.. తల్లిదండ్రుల పరిస్థితి తెలిసి పనిచేసుకుంటూ విద్యను కొనసాగించాడు. టాటా ట్రస్ట్‌లు, పిఎఫ్ దావర్ ట్రస్ట్, మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి స్కాలర్‌పిప్‌లతో పాటు స్థానిక సైబర్ కేఫ్‌లో పనిచేస్తూ చదువుకున్నాడు. బీఎస్సీ (ఐటీ), ఎంఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసిన తర్వాత టీఎసీఎస్‌లో మూడేళ్ల పనిచేశాడు. కుటుంబ బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకుని, మంచానపడ్డ తండ్రి చికిత్సకు డబ్బులను సమకూర్చాడు.
‘నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మూడేళ్లపాటు పనిచేశాను.. ఆ తర్వాత వారాంతాల్లో బ్రిటిష్ కౌన్సిల్‌లో పనిచేశానని చెప్పాడు. ఎన్‌సీసీలో శిక్షణ రక్షణ దళాలలో చేరాలను ఆసక్తిని పెంచింది. ‘నేను 13 ప్రయత్నాల తర్వాత SSB (సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) పరీక్షల్లో అర్హత సాధించాను.. గోప్యమైన విషయం కాబట్టి నా పోస్టింగ్ గురించి చెప్పలేను. ఐటీ పదాతిదళ యూనిట్‌తో అనుబంధంగా ఉన్నానని చెబితే సరిపోతుంది’ అని పేర్కొన్నాడు. ధారవి చుట్టుముట్టే విపత్కర పరిస్థితుల గురించి కూడా ఉమేష్ తెలిపారు.
‘ధారవీలో నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది. నా విజయం ఆ ప్రాంతంలోని ఇతర యువకులను ఆర్మీలో చేరడానికి స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను, ప్రస్తుతం వారికి దాని గురించి పెద్దగా తెలియదు. చాలా మంది ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు... నేను యువతకు చెప్పాలనుకునేది ఒకటే.., మీరు మీ జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పనిచేస్తే దానిని తప్పకుండా సాధిస్తారు. అందుకు సిద్ధంగా ఉండి.. ముందుకు సాగండి.. సమస్యలు, అవరోధాలు, అసమానతలను ఎదుర్కోండి.. ఒకసారి పరీక్షల్లో తప్పినా నిరుత్సాహానికి గురికావద్దు.. చుట్టూ ఉన్నవారితో మాట్లాడండి.. అది మీకు నిజంగా సహాయం చేస్తుంది.’ అని ఉమేశ్ అన్నారు.