గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లో రోబోల వాడకం క్రమంగా పెరుగుతోంది. మనం మెల్లగా రోబో యుగంలోకి అడుగుపెడుతున్నాం. ఎలాంటి పనినైనా రోబోలు అలవోకగా, అలసట అనేది తెలియకుండా చేస్తుండటంతో.. ఖర్చు తగ్గడంతోపాటు ఉత్పాదకత తగ్గుతుందనే ఉద్దేశంతో కంపెనీలు రోబోలవైపు చూడటం మొదలుపెట్టాయి. తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన టెక్నాలజీ ఫెస్టివల్ డీప్ ఫేస్ట్‌లో తొలి పురుష రోబోను ప్రదర్శనకు పెట్టారు.
అయితే ఈ రోబో వ్యవహరించిన తీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అనుమానాలను రేకెత్తించింది. ముహమ్మద్ అని పిలిచే ఈ హ్యుమనాయిడ్ గురించి రవ్యా కాస్సీమ్ అనే రిపోర్టర్ మాట్లాడేందుకు.. దానికి దగ్గరగా వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఆ రోబో తన కుడి చేతిని ముందుకు చాపడంతో.. అది కాస్తా లేడీ రిపోర్టర్ ‘వెనుక భాగానికి’ దాదాపుగా తగిలింది. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రిపోర్టర్.. వారించడం కోసం అన్నట్టుగా తన చేతిని పైకెత్తి రోబో వైపు తిరిగింది. ఇందుకు సంబంధించిన 7 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోబో చేసిన పని సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. దీంతో ఆ రోబోను తయారు చేసిన క్యూఎస్ఎస్ సిస్టమ్స్ స్పందించింది. రోబో దానంతటదే పని చేస్తుందని ఆ కంపెనీ తెలిపింది. రోబో ప్రవర్తన మామూలుగానే ఉందని.. కానీ డెమో ఇచ్చే సమయంలో జనం దానికి మరీ దగ్గరగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. రోబోకు సంబంధించిన ఫుటేజ్‌ను సమగ్రంగా పరిశీలించామని.. రోబో ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని క్యూఎస్ఎస్ సిస్టమ్స్ వెల్లడించింది.
రోబో విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు రోబో చేసిన పనిని విమర్శిస్తే.. మరికొందరు అందులో తప్పుబట్టడానికి ఏం లేదంటున్నారు. రిపోర్టర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికో లేదంటే దూరంగా ఉండాలని చెప్పడానికో రోబో ప్రయత్నించి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. రిపోర్టర్ మరీ దగ్గరగా వెళ్లడంతో ఇలా జరిగిందంటున్నారు.
డెమో సమయంలో రోబోలకు తగినంత దూరం పాటించాలని డీప్‌ఫెస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు. అన్నట్టు ఈ రోబోకు ఓ ఆడతోడు అన్నట్టుగా సారా అనే మరో రోబో కూడా ఉంది. తాము తయారు చేసిన ముహమ్మద్ రోబో.. మనుషులకు ప్రమాదకరమైన పనులను కూడా చక్కబెడుతుందని క్యూఎస్ఎస్ సిస్టమ్స్ వెల్లడించింది. ఆ రోబో మగది కావడం, ఆ రిపోర్టర్ లేడీ కావడంతో ఇంత చర్చ జరుగుతోందిగానీ.. ఒకవేళ రిపోర్టర్ పురుషుడై ఉండి.. రోబో లేడీ అయితే ఇంత డిస్కషన్ జరిగేదా..? శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమాలో చిట్టీ ఎలాగైతే ఐశ్వర్యపై మనసు పారేసుకుందో.. ఈ రోబో కూడా యాంకరమ్మపై మనసు పడలేదు కదా..? అదే నిజమైతే.. ఈ రోబో కూడా మగ బుద్ధి పోనిచ్చుకోనట్టే..! కానీ అప్పుడే రోబోలకు ఫీలింగ్స్ వచ్చే స్థాయికి మన టెక్నాలజీ ఇంకా చేరుకోకపోవచ్చు.