చుక్క నీరు కోసం అల్లాడిపోయే ఏడారి దేశం దుబాయ్‌లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు చినుకు కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే అరబ్ దేశంలో శనివారం నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఖాళీ ప్రదేశాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా బయలుదేరాయి. మొత్తం 13 విమానాలను దారి మళ్లించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. శనివారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు పేర్కొన్నాయి.
మరోవైపు, దుబాయ్ సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్ల కాగా.. కేవలం ఆరు గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసి వర్షానికి ఎక్కడిక్కడ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో స్పందించిన అధికారులు.. హుటాహుటిన సిబ్బందిని రంగంలోకి దింపారు. విరిగిపోయిన చెట్లను తొలగించి, డ్రెయినేజీలను ఖాళీచేయించారు.
భారీ వర్షానికి ప్రధాన జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఆదివారం కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అరేబియా ద్వీపకల్ప దేశంలో వర్షం అసాధారణంగా ఉంటుంది, కానీ శీతాకాలంలో క్రమానుగతంగా సంభవిస్తుంది. దుబాయ్ జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. ‘వివిధ తీవ్రతలతో కూడిన వర్షాలు ఆదివారం వరకు కొనసాగుతాయి.. అయితే ఉత్తర, తూర్పు ప్రాంతాలపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి. అస్థిర వాతావరణం క్రమంగా బలహీనపడి.. ఆదివారం సాయంత్రానికి తూర్పు ప్రాంతాలకే పరిమితమవుతుంది. సోమవారం పొడిగా ఉంటుంది కానీ ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది’ అని తెలిపింది.