విమానం గాల్లో ఉండగానే దానిని నడిపుతోన్న పైలట్లు ఇద్దరూ ఒకే సమయంలో నిద్రపోయారు. దాదాపు అరగంట పాటు పైలట్లు నిద్రపోవడంతో విమానం దారితప్పింది. ప్రధాన పైలట్ మేల్కొని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో భారీ ముప్పు తప్పింది. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో 150 మందికిపైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విస్మయానికి గురిచేసే ఈ ఘటన ఇండోనేషియా (Indonesia)లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఇండోనేషియా ప్రభుత్వం.. ఇద్దరు పైలట్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
జనవరి 25న బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం 153 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిసి సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి ఆ దేశ రాజధాని జకర్తాకు బయలుదేరింది. ఆగ్నేయ సులవేసి- జకార్తా మధ్య ప్రయాణానికి 2.35 నిమిషాల సమయం పడుతుంది. ఈ క్రమంలో కో-పైలట్‌కు చెప్పి ప్రధాన పైలట్ నిద్రపోయాడు. కాసేపటికి ఫ్లైట్‌ను నియంత్రణలోకి తీసుకున్న కో-పైలట్ సైతం నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారిని సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 28 నిమిషాల తర్వాత మేల్కొన్న కెప్టెన్.. కో- పైలట్ కూడా నిద్రపోతున్నాడని గుర్తించి ఖంగుతిన్నాడు. విమానం నిర్దేశిత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించాడు.
వెంటనే అతడిని నిద్ర లేపి, కంట్రోల్ సెంటర్ కాల్స్‌కు స్పందించాడు. ఈ క్రమంలోనే విమానాన్ని సరైన మార్గంలో పెట్టి.. జకర్తా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది ఇండోనేషియా రవాణా శాఖ.. విచారణ చేపడతామని తెలిపింది. స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని ప్రకటించింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా ఇద్దరు పైలట్లు నిద్రపోవడంతో వారిని సస్పెండ్ చేశారు.
అయితే, విమానం నడిపే సిబ్బంది విశ్రాంతి విషయంలో తగిన శ్రద్ద వహించాలని బాతిక్ ఎయిర్‌కు రవాణా శాఖ డీజీ మారియా క్రిస్టీ ఎన్‌డా ముర్నీ సూచించారు. ఈ విమానం నడిపిన ఇద్దరిలో ఓ పైలట్ ముందురోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేదని ప్రాథమిక విచారణ నివేదిక పేర్కొంది. అందుకే విమానం బయలుదేరిన గంటన్నర తర్వాత.. కో-పైలట్ అనుమతితో కెప్టెన్ నిద్రపోయాడని తెలిపింది.