తమిళనాడులోని చెంగల్‌పట్టులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రక్కు ఢీకొనడంతో నలుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. విద్యార్థులు ప్రైవేట్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బస్సుకు అతి సమీపంలోకి ట్రక్కు రావడంతో విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు తిరుచ్చి-చెన్నై హైవేపై వెళ్తోంది. మృతి చెందిన కళాశాల విద్యార్థులను ధనుష్ (18), కమేష్ (19), మోనిష్ (19), రవిచంద్రన్ (18)గా గుర్తించారు. వారు చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకంలోని శ్రీ మలోలన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు.నివేదికల ప్రకారం, వారు కళాశాలకు వెళుతుండగా, బస్సులో రద్దీ ఎక్కువగా ఉన్నందున ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించారు.ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. మేల్మరువత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఐదుగురిని రక్షించి మధురాంతగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు పక్కన వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ కోసం మేల్మరువత్తూరు పోలీసులు గాలింపు చేపట్టారు.