ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషం తాగి.. బిడ్డ ఏడుస్తోందని పాలిచ్చిన తల్లి.. విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 08:00 PM

కళ్లముందు బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ కన్నతల్లి హృదయం తట్టుకోలేకపోయింది. బిడ్డ ఆకలి తీర్చాలనే తాపత్రయంలో పాలు పట్టింది. కానీ మతిస్థిమితం సరిగా లేని ఆ తల్లి.. పాలు పట్టే ముందు చేసిన పని.. తన ప్రాణంతో పాటు చిన్నారి ప్రాణాలను సైతం తీసింది. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన హిందుమతి అనే మహిళకు మానసిక పరిస్థితి బాగాలేదు. గత కొంతకాలంగా మానసిక సమస్యలతో హిందుమతి బాధపడుతోంది. హిందుమతికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే హిందుమతికి మానసిక పరిస్థితి బాగాలేకపోవటంతో కుటుంబసభ్యులు ఎప్పుడూ ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండేవారు. తనతో పాటు తన బిడ్డ బాగోగులు కూడా చూసేవారు. కానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేరు. అందరూ బయటకు వెళ్లటంతో హిందుమతికి, ఆమె బిడ్డకు తోడుగా ఎవరూ లేరు. ఈ సమయంలోనే దారుణం జరిగింది.


మానసిక స్థితి సరిగా లేని హిందుమతి విషం అని తెలియక కళ్లాపి పౌడర్ తాగేసింది. అప్పుడే పక్కనున్న చంటిబిడ్డ ఆకలితో గుక్కపట్టి ఏడవటంతో ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. తాను తాగింది విషమని తెలియని ఆ అమ్మ.. చిన్నారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలు ఇచ్చింది. అప్పటికే హిందుమతి ఒళ్లంతా విషం పాకటంతో హిందుమతి అక్కడే చనిపోయింది. పాలు తాగిన చిన్నారి సైతం ఒంట్లోకి విషం చేరటంతో తల్లిపక్కనే కన్నుమూసింది. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు తల్లీబిడ్డ పడిపోయి ఉండటం గమనించారు. తట్టి లేపేందుకు ప్రయత్నించి చనిపోయినట్లు గుర్తించారు.


స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన తల్లీబిడ్డ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా హిందుమతి చేసిన పని.. ఇద్దరి ప్రాణాలను తీసుకుందని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com