జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటలు సమాజానికే ప్రమాదం అన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి చూపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాలలో ఎకరం కావాలో రెండు ఎకరాలు కావాలో అడిగితే అమ్ముతానన్నారు. పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని.. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారన్నారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు.. సౌమ్యుడు, వివాదరహితుడైన చిరంజీవికి అసలు పోలికే లేదన్నారు.
తాను రౌడీ ఎమ్మెల్యే అయితే తనపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు. పులపర్తి రామాంజనేయులు పదేళ్లు ఎమ్మెల్యేగా చేశారని.. కొటికలపూడి గోవిందరావు ఐదేళ్లు మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారన్నారు. భీమవరం కంపోస్ట్ యార్డు సమస్యను వారు ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలన్నారు. కంపోస్ట్ యార్డుకు ఆరు ఎకరాల భూమిని తానే సేకరించానని.. స్థానికంగా ఉన్న తనను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తరిమితే వెళ్లే వాడిని కాదు .. ప్రజా సేవ అనేది తమ బ్లడ్ లోనే ఉందన్నారు. 2019లో భీమవరం నియోజకవర్గంలో ప్రజలే ఆయనను భీమవరం నుంచి ఆయనను తరిమికొట్టారన్నారు. అసలు పవన్‌కు తనపై అంత అసూయ ఎందుకన్నారు. గతంలో భీమవరం వచ్చి తనపై ద్వేషం లేదన్న పవన్.. ఇప్పుడు రౌడీ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలని సవాల్ చేశారు శ్రీనివాస్. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్న పవన్.. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. జనసైనికులు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వొద్దంటూ చులకనగా మాట్లాడుతున్నారని.. పవన్ నిజ స్వరూపం తెలియక సీఎం అంటూ వారు అరుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని.. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరగబడుతుందన్నారు.
భీమవరం ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పవన్ తెలుసుకుంటే మంచిదని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కంఠస్తం పట్టి మాట్లాడుతున్నారన్నారు. కోవిడ్ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయాల్లో ఇమడలేరని.. తాను ఎమ్మెల్యేగా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయన్నారు. వాటిని తన చేతులతో ప్రారంభించానని.. అభివృద్ధి, నిబద్ధత, అంకితభావంతో పని చేస్తున్నానన్నారు శ్రీనివాస్. భీమవరం జిల్లా కేంద్రం కోసం మంత్రి పదవి సైతం వదులుకున్నానని.. అలాగే 100 పడకల ఆసుపత్రి కోసం తమ కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమిని కూడా ఇచ్చానన్నారు. చంద్రబాబు దండాలు పెట్టి ఎన్నికల తర్వాత పంగనామాలు పెడతారని ప్రజలకు బాగా తెలుసన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం చెప్పాడంటే చేస్తాడంతే అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని.. కరోనా సమయంలో కూడా పేదలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు.
గతంలో ముద్రగడ పద్మనాభాన్ని అవమానిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వంగవీటి రంగాను హత్య చేసిన వారితో పవన్ చేతులు కలిపారని.. ఆఖరికి పవన్ ముఖ్యమంత్రి కావాలని హరిరామజోగయ్య సలహాలు ఇస్తే ఆయన్ను కూడా అవమానించారన్నారు. చంద్రబాబుకు పవన్ బానిసలా మారిపోయారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకున్న రామాంజనేయులును కృష్ణాజిల్లా నుంచి తరిమికొడితే ఇక్కడికి వచ్చారన్నారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్ ఆశీస్సులతో సంక్షేమ పాలన అందిస్తున్నానన్నారు.