తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మరణం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన ట్రోలింగ్ కారణంగా గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్సాఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మార్చి ఏడో తేదీన ప్రమాదం జరిగిందనీ, మార్చి పదో తేదీన వీడియో వైరల్ అయ్యిందని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. అలాంటప్పుడు గీతాంజలి మరణానికి, ట్రోలింగ్ ఎలా కారణమనే ప్రశ్నలు లేవనెత్తతున్నాయి. ఇదే క్రమంలో గీతాంజలిని ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేశారంటూ ప్రయాణికులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియోను కూడా టీడీపీ సోషల్ మీడియా వింగ్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీని వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేసింది.
ఈ క్రమంలోనే గీతాంజలి మరణం మీద హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. గీతాంజలి మరణం గురించి ఆ నేత ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది."తోటి మహిళలు, చిన్నారుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం మహిళా నేతల మొదటి, ముఖ్యమైన లక్షణం. గీతాంజలి అంశం మీద వైఎస్ షర్మిల మౌనంగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెనాలిలోని సాధారణ మహిళలు, బాలికలు బయటకు వచ్చి పాఠాలు ఇలాంటి వారికి పాఠాలు నేర్పించాల్సిన అవసరం ఉంది" అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
గీతాంజలి మరణం విషయం తెలిసిన వెంటనే కూడా పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. గీతాంజలి కుటుంబానికి న్యాయం జరగాలంటే, కారణమైన వారికి కఠిన శిక్షలు పడాలంటూ ట్వీట్ చేసింది. గీతాంజలి విషయంలో ఏం జరిగిందీ? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరింది. అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి వేధించేవారిని కఠినంగా శిక్షించాలంటూ పూనమ్ కౌర్ తన ట్వీట్లో కోరింది. అయితే ఈ అంశం మీద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటి వరకూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో షర్మిల ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పూనమ్ కౌర్ బుధవారం మరో ట్వీట్ చేసింది