ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్ కేటుగాళ్లు అమాయకుల్ని ముంచేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూడా అదే జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువుకు చెందిన అడ్డాల మెస్సీ కుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇంటి దగ్గర ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఫిబ్రవరి 22న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ముంబయి సైబర్ క్రైమ్ పోలీసునని, మీపై డ్రగ్స్ కేసు ఉందని హెచ్చరించాడు.
తమ ఉన్నతాధికారి మళ్లీ మాట్లాడతారని చెప్పాడు. కొంత సమయానికి పోలీసు దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్ చేసి.. మీ ఆధార్ కార్డు వివరాలతో కొరియర్‌లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని బెదిరింపులు మొదలు పెట్టారు. వారి మాటలతో భయపడిన కుమారి వారు చెప్పినట్లుగా చేసింది. ఆమె బ్యాంకు, ఆధార్, పాన్ కార్డు వివరాలతో ఓ ఆన్‌లైన్ లోన్ యాప్‌లో వారు చెప్పినట్లుగా చేయమన్నారు. అలా రెండు గంటలపాటు ఆ లోన్ యాప్‌లో కుమారి చేసిన లావాదేవీల తర్వాత ఆమె బ్యాంకు అకౌంట్‌కు రూ.5 లక్షలు జమయింది.
మరో గంట తర్వాత ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కుమారి అకౌంట్‌లో జమయిన రూ.5 లక్షలతో పాటుగా.. ఆమె బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన రూ.1.95 లక్షలు కలిపి మొత్తం రూ.6.95 లక్షలు మాయమయ్యాయి. మరుసటి రోజు బ్యాంకు వారిని కుమారి సంప్రదించగా.. ఆమె వ్యక్తిగత వివరాలు వినియోగించి ఆన్‌లైన్ లోన్ సంస్థ నుంచి దుండగులు రూ.5 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా తెలిసింది. లోన్ తీసుకున్న డబ్బులతో పాటుగా తన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు చోరీకి గురికావడంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేశారు.