ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులన్ని సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.15వేల చొప్పున మొత్తం మూడు విడతలుగా.. మొత్తం మూడు సంవత్సరాలకు రూ.45 వేలు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో ఈబీసీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఉండాలి. ఎటువంటి ఆస్తి లేని లేదా పట్టణ ప్రాంతాలలో 1000 చ.అ.ల స్థలం (నివాస లేదా వాణిజ్య) కంటే తక్కువ కలిగిన కుటుంబాలు అర్హులు (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది). 3 ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు.
కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించబడినవి. లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి). ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.
5-60 సంవత్సరాల మహిళలు, పుట్టిన తేదీ ఆధారంగా : ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ (క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్).. జనన ధృవీకరణ పత్రం / 10 వ తరగతి మార్కుల పట్టిక, ఆధార్ కార్డు ఉండాలి. ఈ పథకం ద్వారా 45–60 మధ్య వయస్సులో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ తదితర అగ్రవర్ణ అక్కచెల్లెమ్మలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు 45 వేల రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సరే.. అగ్రవర్ణాల్లోనూ ఉన్న పేదవారి కోసం ఈ ఈబీసీ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.