హిందూపురంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన సతీమణి వసుంధర. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి హిందూపురం నుంచే బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ భార్య వసుంధరా దేవి పలు కార్యక్రమాల్లో పాల్గొ్ంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. ఒక రకంగా బాలయ్య తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు్న్నారని అనుకోవచ్చు. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని వసుంధరా దేవి చెప్పారు. హిందూపురం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తాగునీటి ప్లాంట్లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే గతంలో ఆస్పత్రిని అభివృద్ధి చేసినట్లు వసుంధర గుర్తు చేశారు. అలాగే మొబైల్ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత బాలకృష్ణదేనని అన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇప్పటికీ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా మరోసారి ఆయన విజయం సాధించడం పక్కానని వసుంధర ధీమా వ్యక్తం చేశారు. హిందూపురం నుంచి బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీనని విలేకర్లతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మరోవైపు 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బాలయ్య హిందూపురంలో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ సునామీ వీచిన ఆ ఎన్నికల్లోనూ బాలయ్య విజయాన్ని అడ్డుకోలేకపోయారు. రాయలసీమ మొత్తంలో టీడీపీ మూడు సీట్లు సాధిస్తే అందులో బాలకృష్ణ ఉండటం విశేషం. కుప్పం నుంచి చంద్రబాబు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే అప్పట్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కుప్పం, హిందూపురం మీద వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో చంద్రబాబు, బాలకృష్ణలను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే హిందూపురం ప్రజల ఆశీర్వాదంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వసుంధరా దేవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య విజయాన్ని ఆపడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.