బాలికలపై అత్యాచారం కేసులో నేరం రుజువుకావడంతో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.12 వేలు జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన యర్రా సూరిబాబు అలియాస్ గూని సూరిబాబు(48).. 2013 ఫిబ్రవరి ఆరో తేదీన చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి ముగ్గురు బాలికలను మేడపైకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో నాతవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా ఎస్ఐ పి.రమేష్, వాదనలు వినిపించిన అడిషనల్ పీపీ కరణం కృష్ణ, సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.