2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మూల్యాంకనం చేసేందుకు అనుసరించిన విధానం చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. జవాబుపత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధనల్లోని రూల్ 3(9)కి విరుద్ధమని పేర్కొంది. మెయిన్స్‌లో అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీని ఆదేశించింది. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం రెండునెలల సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది. ఇప్పటికే పోస్టింగ్ తీసుకున్న అభ్యర్థులు కోర్టు ఇచ్చే తుది తీర్పుకి కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని అఫిడవిట్ సమర్పించారని గుర్తుచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం తీర్పు ఇచ్చారు. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చిందని, ఆ తరువాత నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనంలో అందులో 202మందిని అనర్హులుగా పేర్కొన్నారన్నారు. జవాబుపత్రం ఒకటే అయినప్పుడు 62శాతం మంది ఎలా అనర్హులు అవుతారని ప్రశ్నించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ 2022 జూన్ 24 హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాల ప్రకటన, పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్లైతే.... అవి ప్రధాన వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయిని స్పష్టంగా పేర్కొంది. అదే విషయాన్ని పోస్టింగ్ ఆర్డర్స్‌లోనూ ప్రస్తావించాలని ఏపీపీఎస్సీకి నిర్దేశించింది. అలాగే కోర్టు ఇచ్చే తుది తీర్పుకి కట్టుబడి ఉంటామని, ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని పోస్టింగ్ తీసుకున్న అభ్యర్ధుల నుంచి హామీపత్రం తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాన వ్యాజ్యాలపై హైకోర్టు సింగిల్ జడ్జి సుదీర్ఘ విచారణ జరిపి బుధవారం తీర్పు వెల్లడించారు.