జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంలో సస్పెన్స్ వీడింది. ఇన్ని రోజులూ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అంటూ ఎదురు చూసిన జనసైనికుల నిరీక్షణకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఎంపీగా పోటీచేసే విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పిన పవన్.. ఎంపీ ఆలోచన ప్రస్తుతానికి లేదని అన్నారు.
మరోవైపు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, లేదా గాజువాకలలో ఏదో ఒక చోట నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అలాగే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. చివరకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైపు జనసేనాని మొగ్గు చూపారు. పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు సుమారు 91 వేలు ఉన్నాయి. మెజారిటీ ఓట్లు కాపు సామాజిక వర్గానివే కావటంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సులభమనే దీనిని ఎంచుకున్నట్లు తెలిసింది. మరోవైపు గత ఎన్నికల సమయంలో కాకినాడలో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గెలుపొందారు.టీడీపీ అభ్యర్థి వర్మ రెండో స్థానంలో నిలవగా.. జనసేన మూడోస్థానానికి పరిమితమైంది.
అయితే పిఠాపురంలో పోటీపై జనసేనాని ముందుగానే సంకేతాలు ఇచ్చారు. వారాహి విజయయాత్రను ఇక్కడి నుంచే ప్రారభించారు పవన్. కాకినాడ జిల్లా నుంచే వారాహి యాత్ర మొదలైంది. అలాగే కొన్నిరోజుల కిందటే గొల్లప్రోలు వద్ద జనసేన హెలిప్యాడ్‌ను అద్దెకు తీసుకుంది. రెండు నెలలపాటు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అయితే పిఠాపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్.. ఇక్కడ హెలిప్యాడ్ అద్దెకు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఈనేపథ్యంలో కాకినాడ రూరల్, పిఠాపురం నుంచి జనసేన పోటీ చేస్తోంది. అలాగే కాకినాడ ఎంపీ టికెట్ సైతం జనసేన తీసుకునే ఆలోచనలో ఉంది. మొత్తానికి జనసేన అధినేత పోటీ విషయమై క్లారిటీ రావటంతో జనసైనికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే పవన్ నేరుగా పిఠాపురం వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.