వచ్చే శాసనసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 34 మంది పేర్లతో రెండో జాబితా ప్రకటించారు . తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. రెండో జాబితాలో మరో 34 మంది పేర్లు ప్రకటించారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకూ 128 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలలో పోటీ చేయనుంది. అయితే ఇప్పటి వరకూ 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. మరో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు పేర్లు ప్రకటించాల్సి ఉంది. అలాగే ఎంపీ సీట్లకు సైతం అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాలో యువతకు, మహిళలకు, విద్యావంతులకు చంద్రబాబు పెద్ద పీట వేశారు. 34 మందిలో ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు.
మరోవైపు రెండో లిస్టులోనైనా తమ పేరు వస్తుందని భావించిన పలువురు సీనియర్ నేతలకు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతల పేర్లు జాబితాలో కనిపించలేదు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తిలకు రెండో జాబితాలోనూ చోటు దక్కలేదు. అలాగే మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు సైతం కనిపించలేదు. గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ విషయమై టీడీపీ అధిష్టానం నుంచి ఆయనకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అయితే విశాఖ జిల్లాలోనుంచే పోటీ చేస్తానని గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీటుపై క్లారిటీ రావటం లేదు.
మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సైతం పెందుర్తి టికెట్ దక్కేలా కనిపించడం లేదు. పెందుర్తిని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన సీటుపైనా క్లారిటీ లేదు. మరో మంత్రి జవహర్‌కు సైతం రెండో జాబితాలో స్థానం దక్కలేదు. కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో నిలుపుతున్నారు. ఇక దేవినేని ఉమా మహేశ్వరరావు విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. మైలవరం నుంచి పోటీచేస్తానని దేవినేని ఉమా ధీమాగా ఉన్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీ కండువా కప్పుకోవటంతో టికెట్ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దేవినేనిని పెనమలూరుకు పంపుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో లిస్ట్ వరకూ ఈ నేతలకు తమ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.