తిరుపతి నగరంలోని ఎంఆర్‌పల్లి శ్రీనగర్ కాలనీలో దుండగులు రెచ్చిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున కాలనీలోని రిటైర్ ఎస్ఐ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. రిటైర్ ఎస్ఐ భార్యను కత్తితో బెదిరించి బంగారం, వెండిని దోపిడీ చేశారు. ఇంట్లో ఎవ్వరూ లేరని అగంతకులు దొంగతనం కోసం తలుపులు బద్దలు కొట్టారు. అయితే భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న తిలకవతి.. అలికిడి రావడంతో బెడ్ రూం నుండి బయటకు వచ్చింది. ఆమెను చూసిన దుండగులు.. కత్తితో బెదిరించి వంటిపై ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను అపహరించారు. దాదాపు 80 గ్రాముల బంగారు, 2.5 కేజీల వెండి వస్తువులను దోపిడీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ నాగేంద్రబాబు ఈ కేసును విచారిస్తున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు అగంతకులు ఇంటిలోకి ప్రవేశించగా.. మరొకరు బయట కాపాలా ఉన్నట్టు గుర్తించారు.