ఏపీపీఎస్సీలో అవకతవకలు అంటూ ప్రభుత్వాన్ని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో వ్యాల్యుయేషన్ జరగలేదని కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని యువత కలలు కంటుంటారని అన్నారు. నీతినిజాయితీ ఉన్న వ్యక్తిని ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉన్నారని, కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ రాజకీయ పునరావస కేంద్రంగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆలిండియా సర్వీసులు ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసులు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.