ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా అభ్య ర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు జరిపిన తర్వాతే గెలుపు గుర్రాలను ఖాయం చేస్తున్నాయి. తాజాగా గురువారం టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇందు లో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజమహేంద్రవరం రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరును ఖాయం చేసింది. ప్రత్తిపాడు నుంచి వరుపుల సత్యప్రభ, రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష పేర్లు ఖరారయ్యాయి. వాస్తవానికి గత నెల 24న టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమయంలో ఈ నాలుగు సీట్లను పెండింగ్‌లో ఉంచింది. వీటిలో కొన్ని సీట్లను జనసేన కోరుతుండడం, మరికొన్నిచోట్ల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో పార్టీ అధిష్ఠానం విస్తృత కసరత్తు జరిపింది. రాజమహేంద్రవరం రూరల్ సీటు విషయమై ఇరుపార్టీల మధ్య పీటముడి కొనసాగడంతో తొలి విడ త జాబితాలో అభ్యర్థి ప్రకటన వాయిదాపడింది.ఎట్టకేలకు ఈ సీటుపై ఇరుపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. రాజ మహేంద్రవరం రూరల్ సీటుకు బదులు దుర్గేష్‌కు నిడదవోలు ఇవ్వడానికి టీడీపీ ముందుకు రావడంతో బుచ్చయ్యకు లైన్‌క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో గురువారం నాటి జాబితాలో గోరంట్ల పేరు ప్రకటించారు. అటు రామచంద్రపురం సీటు కోసం శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్, కాదా వెంకటరమణ పోటీపడ్డారు. వైసీపీ నుంచి ఎంపీ బోస్ తనయుడు బరిలో ఉన్న నేపథ్యంలో ఆయన్ను సమర్థవంతంగా ఢీకొట్టే యువకుడిగా సుభాష్‌ను గుర్తించి ఆయనకు సీటు ఖాయం చేశారు. పైగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడానికి ముందురోజు కూడా టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టింది. ఇందులో సుభాష్ వైపు మొగ్గు రావడంతో పేరు ఖాయం చేసింది. ప్రత్తిపాడు సీటు వరుపుల సత్యప్రభకు ఖాయమైంది. తొలివిడత జాబితాలో ఈమె పేరు ఉంటుందని భావించినా పార్టీలో అంతర్గత సమస్యలను చక్క దిద్దాల్సి రావడంతో ప్రకటన వాయిదా వేశారు. అటు జనసేన కూడా ఈ సీటు కోరడంతో ప్రకటించలేదు. అయితే పిఠాపురం సీటు నుంచి పవన్ పోటీ ఖాయం అవడంతో, ప్రత్తిపాడు నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన సత్యప్రభకు లైన్‌క్లియర్ అయింది. అటు రంపచోడవరం సీటు అనూహ్యంగా మిర్యాల శిరీషను వరించింది. రాజవొమ్మంగి మండలం గింజర్తికి చెందిన ఈమె గిరిజనతెగలో కోయ సామాజికవర్గానికి చెందినవారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సీటు ఆశించినా వైసీపీకి ధీటైన అభ్యర్థిగా శిరీష అని తేలడంతో సీటు ఈమెకే ఖరారైంది. తాజాగా టీడీపీ ప్రకటించిన నాలుగు సీట్లలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేతలే. ఇదిలా ఉంటే తాజా రెండో జాబితాతో కలిపి ఇప్పటివరకు మొత్తం 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించినట్టయింది. ఇందులో ఎక్కడి కక్కడ సామాజిక సమతూకం పాటించి అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుని గెలుపుగుర్రాలను ఎంపిక చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.