మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు గన్‌మెన్ తొలగింపుపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీకే బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ భార్య సీకే లావణ్య హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉన్న నాయకుడు సీకే బాబు అని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజల వద్దకు వెళుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సమయంలో ఆయనకు ఉన్నటువంటి భద్రతను తొలగించడం ఆయనను ప్రజలకు దూరం చేసినట్లే అవుతుందని అన్నారు. గతంలో సీకే బాబుపై 9 సార్లు హత్యాయత్నం జరిగిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటే భయమేస్తుందని భార్య ఆందోళన వ్యక్తం చేసింది. తమకు తొలగించిన భద్రతను పునరుద్దించాలని ఎస్పీకి వినతి చేశారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ సీకె బాబు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలో భద్రత తొలగింపుపై అధికార వైసీపీపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.