అమరావతి రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. యూ-1 రిజర్వు జోన్ రైతుల విషయంలో హఠాత్తుగా వెనక్కి తగ్గింది. జోన్ తొలగించాలని కోరుతూ రైతులు 2022లో 146 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తాడేపల్లి మండలంలోని యూ-1 రిజర్వు జోన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాల పరిధిలో 178 ఎకరాలపై ఉన్న జోన్ ఆంక్షలు తొలగించి మిశ్రమ భూ వినియోగాల మార్పిడికి అనుకూలంగా మార్పు చేసింది. దీంతో పాటు రాజధాని గ్రామం ఉండవల్లిలోని భూములను యూ-1 జోన్ నుంచి ఆర్-3 జోన్‌కు మార్పు చేశారు.
ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ తమ ప్రసంగాల్లో యూ-1 రిజర్వు జోన్ విషయాన్ని ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులూ లేకుండా రిజర్వు జోన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఇటీవల ఉండవల్లిలో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుండి యూ-1 రిజర్వు జోన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది ప్రభుత్వం.
అమరావతి ప్రాంతంలోని 178 ఎకరాల భూమిని రాజధాని అవసరాల నిమిత్తం నాడు యూ-1 జోన్ గా ప్రకటించారు.ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.. చివరికి ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది.