ఎన్నికల సమయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించడం తీవ్ర కలకలం రేగుతోంది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. దీనిపై సీకే బాబు సతీమణి లావణ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా ఉన్న తన భర్తకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించడం శోచనీయమని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. గతంలో ఆయనపై తొమ్మిది సార్లు హత్యాయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాజకీయ అక్కసుతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ధ్వజమెత్తారు.
చిత్తూరులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘సీకే బాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజల మధ్యనే ఉన్నారు.. గతంలో ఆయనపై తొమ్మిది పర్యాయాలు హత్యాయత్నాలు జరిగాయి. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఎనిమిది మంది గన్‌మెన్లను కేటాయించారు.. తర్వాత నలుగురికి కుదించారు. ప్రస్తుతం టీడీపీ- జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు మద్దతుగా సీకే బాబు ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రజాభిమానాన్ని కూడగడుతున్న సీకేబాబును చూసి ఓర్వలేక.. రాజకీయ అక్కసుతో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అధికార పార్టీ తొలగించింది. ప్రత్యర్థుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉంది.. వాస్తవాలు గుర్తించాలని ఆయన అభిమానుల తరఫున ఎస్పీకి విన్నవిస్తున్నాం. భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయకుంటే న్యాయపోరాటం చేస్తాం’ అని లావణ్య స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.
చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు సీకే బాబు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల సీకేబాబును మర్యాద పూర్వకంగా కలిసిన జగన్మోహన్.. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన సీకే బాబు... జగన్మోహన్‌కు మద్దతు తెలిపారు. తాను గత ఐదేళ్లుగా టీడీపీలోనే ఉన్నా.. వివిధ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa