విశాఖపట్నం వేదికగా జరిగిన కాంగ్రెస్ న్యాయసాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. టీడీపీ, జనసేన, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీకి అనుకూలంగా మారిపోయాయని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, మాజీ గురువు చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా.. మోదీని నిలదీస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల మీద మోదీని ప్రశ్నించే దమ్ముందా అని నిలదీశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచినా, చంద్రబాబును గెలిపించినా.. మోదీకి దొడ్లోకి దూరేటోళ్లే అంటూ విమర్శించారు. ఏపీ సమస్యలపై ప్రశ్నించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.
ఇక విశాఖ కాంగ్రెస్ పార్టీకి సభకు వస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వద్దని వారించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ లేదని, సభ ఫెయిల్యూర్ అయితే చెడ్డపేరు వస్తుందని భయపడ్డారని తెలిపారు. అయితే వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల నాయకత్వంపై నమ్మకంతో వచ్చానని అన్నారు. "విశాఖ సభను చూస్తుంటే నాకు హైదరాబాద్‌లో సభ నిర్వహించినట్లు ఉంది. విశాఖలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు వెళ్తానంటే తెలంగాణలోని నా సహచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలు వద్దన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదు కదా.. సభ వైఫల్యం అయితే మనకు చెడ్డపేరు వస్తుందన్నారు. కానీ నేను వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వారసురాలు షర్మిల నాయకత్వంపై నమ్మకంతో వచ్చాను. వైఎస్ఆర్ వారసులు అంటే ఆయన ఆశయాలకు తూట్లు పొడిచేటోళ్లు కాదు. ఆయన ఆశయాలను నిలబట్టేవాళ్లు. ఆయన సిద్ధాంతాల కోసం పోరాడేవాళ్లు. అందుకే వైఎస్ఆర్ వారసురాలు షర్మిలే" అంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక వైఎస్ షర్మిల మీద వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ వారసత్వం గురించి ప్రశ్నిస్తున్న నేతలకు వైఎస్ షర్మిలరెడ్డి అంటే వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తానంటే తాను వద్దు అన్నానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదని.. వద్దని వారించానని చెప్పారు. కానీ ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వైఎస్ఆర్ వారసురాలిగా పోగొట్టుకున్న చోట కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని చెప్పి ఏపీ రాజకీయాల్లోకి షర్మిల చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసమో షర్మిల రాలేదనీ..ఏపీ ప్రజల కోసం షర్మిల వచ్చిందని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పోలవరం ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. గత పాలకులు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న రేవంత్ రెడ్డి.. ఢిల్లీని శాసించి డిమాండ్లు నెరవేర్చుకునే నాయకులు ఏపీలో లేరని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందామని పిలుపునిచ్చారు.